శివ (పిన్స్) తమ కుటుంబ అప్పులు తీర్చటం కోసం బాపినీడు (చౌదరి), చిట్టితల్లి (తీర్థ)నిర్వహించే నకిలీ మద్యం తయారీ కేంద్రంలో చేరతాడు. అక్కడ అప్పటికే పనిచేస్తున్న గాయత్రి (నందిత)కి... శివ తెగ నచ్చేస్తాడు. దాంతో ఆ ప్రేమని శారీరిక కలయిక దాకా తీసుకువస్తుంది. తర్వాత గాయత్రి గర్భం దాల్చిన విషయం లేడీ విలన్ చిట్టితల్లికి తెలిసి చావబాదుతుంది. అదే సమయంలో శివ కూడా అక్కడ డబ్బుని తీసుకుని పారిపోవాలని ప్లాన్ చేస్తాడు. ఈ విషయం విలన్స్ కి తెలిసి వెంబడిస్తారు. అక్కడ నుంచి ఆ జంట ఎలా తప్పించుకుని బయిటపడింది... అసలు శివకు డబ్బు దొంగతనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయాలు తెలియాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.
తమిళ డబ్బింగ్ చిత్రం షాపింగ్ మాల్ ని గుర్తు చేస్తూ మొదలైన ఈ కథ .. ఫస్టాఫ్ ..హీరోయిన్ ఊతపదం 'డాష్', సుమన్ శెట్టి కామెడీ తో నడిచిపోతుంది. అయితే రొటీన్ అనుకున్నాడో ఏమో కాన ఫస్టాఫ్ లో హీరో,హీరోయిన్స్ మధ్యన ఎస్టాబ్లిష్ చేయాల్సిన ప్రేమ సీన్స్ ని మాత్రం చేయలేదు. కేవలం శారీరిక బంధం ఏర్పరిచి దాన్నే ప్రేమ అనుకోండి అన్నట్లుగా చూపెట్టాడు. దాంతో సెంకండాఫ్ లో హీరో, హీరోయిన్స్ మధ్యన వచ్చే ఛేజింగ్ సీన్స్, విలన్స్ ని ఎదిరించే సన్నివేశాలు పండలేదు. దానికితోడు ఏదో నిధి వేట అన్నట్లు ..ఈ ప్రేమ కథ కాస్తా.. విలన్ ..హీరో వెనక డబ్బు కోసం పడుతూ పరుగెడుతుంది. చివరలో మరీ విచిత్రంగా విలన్ ని మరో క్యారెక్టర్ చేత చంపించేసారు.. హీరోకి ఆ అవకాశం ఇచ్చి క్రిమినల్ ని చేయటం ఎందుకనుకున్నారో ఏమో గానీ.. అదే గత సూపర్ హిట్ తేజ చిత్రాల్లో ఫస్టాఫ్ లో ప్రేమ కథని చూపి, సెకండాఫ్ లో వారు తమ ప్రేమను నిలబెట్టుకోవటం కోసం చేసే ప్రయత్నాలు యువతను ఆకట్టుకున్నాయి. అదే ఈ సినిమాలో మిస్సైంది. అది కథన సమస్యే.
టెక్నికల్‌గా చూసుకుంటే రెడ్ ఎపిక్ 5కె రిజల్యూషన్ కెమెరాతో షూట్ చేశారు. ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోనే దీన్ని ఉపయోగించడం ప్రథమం అని చెప్పారు కానీ...కథ బాగుంటే దాని విషయం బాగా ఎలివేట్ అయ్యేది. పాటల్లో టైటిల్ సాంగ్ బాగా వర్కవుట్ అయ్యింది. ఎడిటింగ్, రీరికార్డింగ్ ఓకే. తేజ స్వతహాగా కెమెరామెన్ కావంటంతో చాలా చోట్ల విజువల్ బ్యూటి కి అవకాసం ఏర్పడింది. ఇక నటీనటుల్లో కొత్తగా పరిచయమైన హీరోయిన్ నందిత, విలన్ చౌదరి బాగా చేసారు. పరుచూరి వెంకటేశ్వరావు క్లైమాక్స్ పంచ్ బాగుంది. డైలాగులు సోసోగా ఉన్నాయి. యువతను టార్గెట్ చేసిన ఈ చిత్రం సెకండాఫ్ దెబ్బకొట్టడంతో వారిని అయినా ఎంత వరకూ థియేటర్స్ కి లాక్కువస్తుందో చూడాలి. అయితే తక్కువ బడ్జెట్ లో చేసిన సినిమా కాబట్టి ఎవరికీ నష్టాలు రాకపోవచ్చు. ఓపినింగ్స్ బాగా రావటంతో రికవరి బాగానే ఉండే అవకాశం ఉంది.
No comments:
Post a Comment