Thursday 12 April 2012

షారూఖ్ ఖాన్‌కు అమెరికాలో మరోసారి అవమానం

 
న్యూయార్క్: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌కు అమెరికాలోమరోసారి అవమానం ఎదురైంది. తనిఖీల పేరిట ఆయనను అధికారులు న్యూయార్క్ విమానాశ్రయంలో రెండు గంటల పాటు నిలిపేశారు. యేల్ విశ్వవిద్యాలయం అభ్యర్థన మేరకు ఆయన ఆ విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

షారూఖ్‌తో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా ఉన్నారు. నీతా అంబానీ కూతురు యేల్ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. ఒక ప్రైవేట్ విమానంలో ప్రయాణించి న్యూయార్క్ విమానాశ్రయంలో దిగిన షారూఖ్‌ను సెక్యూరిటీ సిబ్బంది రెండు గంటలకు పైగా విచారించారు. దీనిపై షారూఖ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఇమిగ్రేషన్ అధికారులు ప్రతి ఒక్కరి విషయంలో వెంటనే క్లియరెన్స్ ఇచ్చారు. అయితే షారూఖ్‌ను మాత్రం ఆపేశారు. రెండు గంటల పాటు నిలిపేసిన తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు షారూఖ్‌కు క్లియరెన్స్ ఇచ్చారు. యేల్ విశ్వవిద్యాలయం అధికారులు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీని, వాషింగ్టన్‌లోని కస్టమ్స్ డిపార్టుమెంటును సంప్రదించిన తర్వాత షారూఖ్‌ను నిర్బంధించిన విషయం తెలిసిందని అంటున్నారు.

నెవార్క్ విమానాశ్రయంలో 2009లో షారూఖ్‌కు ఇదే రకమైన అనుభవం ఎదురైంది. అప్పుడు కూడా రెండు గంటల పాటు విచారించిన తర్వాత షారూఖ్ ఖాన్‌ను వదిలేశారు. అప్పుడు ఈ విషయంపై తీవ్ర వివాదం చెలరేగింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...