Wednesday, 15 August 2012

'తొక్క' సినిమా ('దేవుడు చేసిన మనుషులు' రివ్యూ


పూరీ, రవితేజ కాంబినేషన్ సినిమాలంటే ప్రేక్షకుల్లో ఓ క్రేజ్. దానికి కారణం గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇడియట్,అమ్మా నాన్న తమిళ అమ్మాయి,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం వంటి ఘన విజయం సాధించిన సినిమాలు వీరి ఖాతాలో ఉండటం. అయితే ఈ సారి ఈ చిత్రానికి అంత క్రేజ్ క్రియేట్ కాలేదు. రవితేజ వరస ప్లాపుల్లో ఉండటం, పూరీ జగన్నాధ్ ఈ సినిమాలో కథే లేదని రిలీజ్కు ముందుగానే ప్రకటన చేయటం వంటివి కారణాలు అయ్యాయి. అయినా స్టార్ హీరో, స్టార్ డైరక్టర్ ఎఫెక్టుతో ఓపినింగ్స్ బాగున్నా దాన్ని నిలబెట్టుకునే పరిస్ధితి కనపడటం లేదు. కథే లేని సినిమా అని పూరి చెప్పారు కానీ అసలు ఏమీ లేని సినిమా అని ఫీలయ్యే స్ధితి వచ్చింది. 
puri devudu chesina manushulu review
సంస్థ: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర
నటీనటులు: రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, కోవై సరళ, సుబ్బరాజు, అలీ, ఫిష్‌ వెంకట్‌, బ్రహ్మాజీ, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు
కెమెరా: శ్యామ్‌.కె.నాయుడు,
సంగీతం: రఘు కుంచె,
పాటలు: భాస్క రభట్ల,
ఎడిటింగ్‌: ఎస్‌. ఆర్‌.శేఖర్‌,
ఫైట్స్‌: విజయ్‌,
డాన్స్‌: ప్రదీప్‌ ఆం థోని, దినేష్‌,
సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌,
సహనిర్మాత: భోగవల్లి బాపి నీడు, రిలయన్స్‌ ఎంట ర్‌టైన్‌మెంట్‌,
ప్రొడక్షన్‌ డిజెనర్‌: చిన్నా,
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌
కథ- కథనం- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.
విడుదల:ఆగస్టు 15,2012
ఓ రోజు వైకుంఠంలో విష్ణు మూర్తి(బ్రహ్మానందం)ని లక్ష్మి దేవి(కోవై సరళ)ని ఏదన్నా కథ చెప్పమని అడిగితే... ఆయన 'దేవుడు చేసిన మనుషులు' కథ చెప్పటం ప్రారంభిస్తాడు. ఆ కథలో ఇండియాలో ఉండే రవి (రవితేజ) సెటిల్‌మెంట్లు చేస్తుంటాడు. అతనికి దైవం నిర్ణయించిన జోడి ఇలియానా (ఇలియానా). ఆమె బ్యాంకాక్ లో డ్రైవర్‌గా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఎమ్.ఎస్ నారాయణ(పనిలేని పాపన్న) అరటిపండు తిని తొక్క పారేయంటంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ అరటిపండు ఎఫెక్టుతో అనుకోకుండా ఎస్సై సుబ్బరాజు(సుబ్బరాజు) బ్యాంకాక్ డాన్ ప్రకాష్‌ (ప్రకాష్‌రాజ్‌) అనుచరుడుని చంపేస్తాడు. దాంతో ప్రకాష్ రాజ్ నుంచి ప్రాణం ముప్పు ఉన్న సుబ్బరాజు.. సెటిల్ మెంట్ రవి ద్వారా..ప్రకాష్ రాజ్ తో సెటిల్ మెంట్ చేసుకోవాలని నిర్ణయించుకోవటాడు. దాంతో రవి.. బ్యాంకాక్ ప్రయాణం పెట్టుకుంటాడు. బ్యాంకాక్ వెళ్లిన రవి అక్కడ ఇలియానాని ఎలా కలుసుకున్నాడు... ప్రకాష్ ని ఎలా డీల్ చేసాడన్నది ఫస్టాఫ్. సెకండాఫ్ కి వస్తే... ఎమ్.ఎస్ నారాయణం తొక్క పాడేయకపోతే ఏం జరుగుతుంది అన్న కోణంలో ఇదే కథ కొద్ది పాటి మార్పులతో రిపీట్ అవుతుంది. అదేమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
దేవుడున్నాడని మనస్పూర్తిగా నమ్మి ఈ సినిమా చూడండి.. అప్పుడు అనుమానాలు ఉండవు అనే కార్డ్ వచ్చిన తర్వాత సినిమా స్టార్ అవుతుంది... నిజానికి ఆ విషయం పూరీ జగన్నాధ్ ముందే చెప్పి హెచ్చరించకపోయినా చెప్పకపోయినా సినిమా చూస్తున్న ప్రేక్షకులు దేముడ్ని ఉన్నాడని నమ్మి తలుచుకోవటం మానరు. వాస్తవానికి Sliding Doors (1998), Run Lola Run (1998) చిత్రాల ప్రేరణతో రూపొందిన ఈ చిత్రం పూర్తి స్క్రీన్ ప్లే మీద నడిచేది..అంతేకానీ హీరో,హీరోయిన్,విలన్ మధ్య నడిచే కథ కాదు. కానీ పూరి జగన్నాధ్ ఈ కథకు ఓ స్టార్ హీరోని, హీరోయిన్ ని తీసుకురావటంతో ప్రేక్షకుడు వాళ్లను ఫాలో అయ్యి ఈ స్క్రీన్ ప్లేని ఎంజాయ్ చేయటం కష్టమనిపిస్తుంది. ఎందుకంటే కథలో హీరో చేయటానికి ఏమీ ఉండదు. పైనున్నవాడు(బ్రహ్మానందం)ఎలా నడిపితే అలా నడుస్తుంది అన్న ధోరణిలో నడుస్తుంది. అందులోనూ ఈ కథా బ్రహ్మ పూరీనే కాబట్టి హీరోని వదిలేసి తనకు నచ్చనట్లు నడిపేసి ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టాడు. అయినా పూరీ జగన్నాధ్ మొదటి నుంచీ ఈ చిత్రంలో కథ లేదు అని చెప్తూనే ఉన్నారు కాబట్టి ఆయన్ని తప్పు పట్టడానికి లేదు. చెప్పినా వినకుండా నమ్మి సినిమాకి వెళ్లిన వారిదే తప్పు అనిపిస్తుంది. ఈ కథలో విలన్ గా చేసిన ప్రకాష్ రాజ్ ని మతిమరుపు డాన్ గా చూపెట్టి నవ్వులు పూయించాలనుకున్నారు కానీ అలా చేయటంతో కథలో ఇంటెన్సిటీ తగ్గటం వల్ల ఒరిగిందేమి లేదు. అంతేగాక విలన్ బలహీనడు అవటంతో... హీరోకి ఎక్కడా కాంప్లిక్ట్ కాని,సమస్యగానీ లేకుండా నడిచిపోతూంటుంది.
ఇక రెగ్యులర్ గా బ్రహ్మానందం,అలీ మధ్యన జరిగే కామెడీ పూరీ సినిమాల్లో హెలెట్ అవుతూంటుంది. అయితే ఈ సినిమాలో అదీ మైనస్ అయ్యింది. ఎప్పుడో పూర్వకాలం నాటి... దురదృష్ణం మన వెంట ఉంటే లక్ష్మి దేవి కూడా ఏమీ చేయలేదనే కథను ఎడాప్ట్ చేసారు... కానీ అది పండలేదు. రవితేజ మ్యానరిజంస్,డైలాగ్ డెలవరీ బోర్ కొట్టే స్ధితికి చేరుకున్నట్లు ఈ సినిమా గుర్తు చేస్తుంది. అలాగే చిత్రంగా ఇందులో పూరీ మార్కు డైలాగులు కూడా పెద్దగా లేవు.. ఉన్న కొద్దీ పేలలేదు. ఇలియానా... జులాయి సినిమాలో చెప్పినట్లు ఈ సినిమాలో కూడా.. కరవు దేశానికి బ్రాండ్ అంబాసిడర్ లాగానే ఉండటంతో ఆమె ప్లస్ కాలేకపోయింది. ఆడియో పరంగా రెండు పాటలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా సుబ్బలక్ష్మి పాట హైలెట్ అయ్యింది. పాటలకు కూడా ప్లేస్ మెంట్ లేకపోవటంతో క్లైమాక్స్ అయిపోయాక శుభం కార్డుతో పాట పెట్టడం అనేది ఈ సినిమాలోనే కనపడుతుంది. ఎడిటింగ్,కెమెరా ఓకే అనిపిస్తాయి. నిర్మాణ విలువలు పరంగా పెద్దగా ఏమీ లేదు..చుట్టేసినట్లు కనపడుతుంది.
ఫైనల్ గా.. ఈ సినిమాలో చెప్పినట్లు తొక్క మీద జారిపడితే ఏమౌతుంది... జారిపడకపోతే ఏమౌంతుంది.. అన్నట్లుగా... కథ ఉంటే సినిమాలు ఎలా ఉంటాయి... కథ లేకపోతే ఎలా ఉంటాయి అన్నదానకి ఈ సినిమాని.. పూరి గత సినమాలను పోల్చుకోవచ్చు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...